బృందజపం అంటే ఏమిటి?
మంత్రం--
శబ్దానికి అనంత శక్తి ఉన్నది. సత్సంకల్పానికి దాన్ని సరైన దిశలో ఫలింపచేసే చేవ ఉన్నది. వివిధ శబ్దాలను చేర్చి ఒక ఉత్తమ భావాన్ని కల్పించినందున అది ఫలితాన్ని ఇవ్వగలిగే శక్తిని పొందుతుంది. మననం చేసినంతమాత్రంచేత రక్షణం చేసేవే మంత్రాలు.
జపం--
జపం అంటే ఒక నామమంత్రం లేదా శ్లోకమంత్రాన్ని దేవతకై అనేకమార్లు చదివటం. ఒకసారి చదవటం వల్ల పూర్తి ఫలం లభించదు కనుక ఒక మంత్రాన్ని అనేక మార్లు ఆవృత్తిగా ఉచ్చరించటమే జపం అంటే. (వేదమంత్రాలు అందరూ చదవరాదు కనుక శ్లోక లేదా నామమంత్రాలను తీసుకుంటాము.) ఆ మంత్రం చదవటం వల్ల వచ్చే ఫలితాన్ని జపకర్త తప్పక పొందుతాడు.
బృందజపం--
అనేకులు కలిసి అనేకమార్లు జపం చేస్తే అదే బృందజపం. వ్యక్తిగతంగా చేస్తే వారు ఒకరే, ఒక వంతే పొందుతారు. అదే ఇతరులు కూడా చేరితే అందరూ కలిసి చేసిన జపం ఫలితం ఎందరు జనులు ఉంటే అన్ని ఇంతలు (టు ద పవర్ ఆఫ్) అవుతుంది. పది మంది ఉంటే పదింతల ఫలితం పదిమందికీ లభించి, సంకల్పిత కార్యం త్వరగా సిద్ధిస్తుంది.
వినియోగం--
జపాన్ని కేవలం ధర్మమైన కోరికలకే వినియోగించాలి. సత్సంకల్పాలు మాత్రమే చేయాలి. అందరి శ్రేయస్సుకై సంకల్పిస్తే మన శ్రేయస్సు కూడా అందులో భాగంగా మనకు చేరుతుంది. అట్లాగని మన కోరికలు చెప్పుకోకూడదని కాదు. మనం వైయక్తిక కోరిక కోసం కూడా చేసుకోవచ్చు. ఒక వారం ఒక పర్యాయం. ఒక శ్లోకం, ఒక 108 మాల మాత్రమే. నియమితంగా చేయటం అతి ముఖ్యం.
ఫలితాలు--
సామాన్యంగా ఒక మంత్రానికి ఒక ఫలితం ఉంటుంది. రకరకాల ఫలితాలను మనం కోరుకోవచ్చు. ఒక దేవతానుగ్రహం ఒక దిశగా పొందాలి అంటే ఒక పద్దతిని అనుసరించాలి. ఉదా-- ఆరోగ్యం- సూర్యుడు, ధనం- లక్ష్మి, శక్తి- హనుమంతుడు, రక్షణ- దుర్గ...ఇట్లా.
ఫలసిద్ధి--
ఇది మన చేతిలో ఉండదు. నియమపూర్వకంగా పద్ధతిగా చేసిన దేనికైనా తప్పక సత్ఫలితం ఉంటుంది. ఒకసారి ఫలితం త్వరగా రావచ్చు. లేదా ఆలస్యం కావచ్చు. మనం దాన్ని పట్టించుకోవద్దు. నిరాశ పడవద్దు. ఒకసారి త్వరగా వస్తే ప్రతీసారి అదే అవుతుందనీ అనుకోవద్దు. ఆశ పడితే నిరాశ వస్తుంది. అందువల్ల ముందే తటస్థంగా అనుష్ఠానంపై ధ్యాసపెట్టాలి. చేస్తున్న కొద్దీ నిష్ఠ కుదిరి క్రమంగా ఫలితం కూడా క్రమబద్ధం అవుతుంది. సత్సంకల్పంతో చేసిన ప్రయత్నం తప్పక ఫలిస్తుంది.
----------------------------
బృందజపానికి నియమాలు
పూర్తి ఫలితాలకై కొన్ని నియమాలను తప్పక పాటించాలి-
రంగానికి పూర్వం-
శ్రద్ధ--
నూటికి వందశాతం శ్రద్ధ అవసరం. ఈ ప్రయత్నం ఫలిస్తుందా లేదా అనేది దైవానికి వదిలిపెట్టాలి. మనం పద్ధతిని వందశాతం పాటించామా లేదా అనే దానిమీదే దృష్టిపెట్టాలి. మనసు అటూ ఇటూ పోకుండా, చెప్పినవి విని, పాటిస్తే తప్పక ఫలితంలో సహకరిస్తాయి.
శుచి--
శుచిగా ఉండాలి. స్నానం చేసి రావాలి. లేదంటే కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని రావాలి.
(మహిళలు అనర్హమైన దినాలలో జపం చేయరాదు. దూరం ఉన్నవేళ తాము ఈ ప్రయత్నం కచ్చితంగా మానుకోవాలి.)
వస్త్రాలు--
బట్టలు శుచి అయినవి, ఉతికి ఆరినవి ఉండాలి. (బయట తిరిగి వచ్చినవి, ఉతకనివి, పూజకు పనికిరానివి వేసుకోరాదు.) సాధ్యమైనంతవరకు పూజకోసం ధరించేటటువంటి సంప్రదాయిక దుస్తులే ధరించాలి. స్త్రీలు చీర ఉత్తమం. డ్రెస్ వేసుకుంటే ఓణీవేసుకోవాలి. పురుషులు- పంచ, కండువా ఉత్తమం. లేదంటే ప్యాంట్ షర్ట్ వేసుకోవచ్చు. మిగితావి నివారిస్తే మంచిది.
స్థలం--
ఇంట్లో శుచి అయిన చోటే కూర్చోవాలి. పూజాగృహంలో కూర్చోవచ్చు. తూర్పుముఖంగా కూర్చుంటే మంచిది. లేదా ఏ దిశ అయినా ఫరవాలేదు.
ఆసనం--
దర్భ లేదా బట్టతో చేసిన ఆసనం వేసుకుని, క్రింద కూర్చోవాలి. అర్ధపద్మాసనం (బాస్పెట్లు) వేసుకుని కూర్చోవాలి. ఆసనం వాడిన తరువాత నిత్యం శుచిగా పూజాస్థలంలోనే పెట్టుకోవాలి. ఇతర వేళలో కానీ, ఇతరులు కానీ దానిని తాకకుండా జాగ్రత్త పడాలి.
కూర్చునే పద్ధతి--
వీపు నిటారుగా ఉంటాలి. గోడకు ఆనుకుని కూర్చోవచ్చు. అనారోగ్య కారణాల చేత లేదా వయసు చేత కింద కూర్చోలేనివారు చిన్న ఎత్తుబల్లపై లేదా ప్లాస్టిక్ కుర్లీలో కూర్చోవచ్చు.
జపమాల--
జపమాల అవసరం లేదు. కావాలంటే పద్దతి తెలుసుకుని పెట్టుకోవచ్చు. కుడిచేతి వేళ్ళమధ్య పట్టి హృదయానికి దగ్గరగా పెట్టుకోవాలి. ఏదైనా బట్టతో ఆ జపమాల దాగి ఉండాలి. బయటకు బాహాటంగా పట్టుకోరాదు.
చదివే పద్ధతి--
పెద్దగా పైకి, లేదా మౌనంగా లోపల చదవవచ్చు. మంత్రార్థాన్ని భావిస్తూ లేదా శబ్దాన్ని మాత్రం వింటూ చదవవచ్చు. సాధ్యమైనంత భక్తి, శ్రద్ధ, సమర్పణభావం ఉండాలి. మంత్రజపం వేళ కన్నులు మూసుకోగలిగితే ఉత్తమం. ఎక్కడైనా నిశ్శబ్దంగా ఉండేచోటు ఎంచుకోవాలి. మనసు కుదిరేందుకు ఏకాంతం ఉంటే మంచిది.
ధ్యాస--
మొదటి స్థాయిలో శబ్దంపై, రెండవస్థాయిలో అర్థంపై ధ్యాసపెట్టాలి. మూడవస్థాయిలో ఆ శ్లోకతత్త్వంపై లేదా దేవతపై ధ్యాసపెట్టాలి. నాలుగవస్థాయిలో మీకు కావాల్సిన కార్యంపై ధ్యాసపెట్టాలి. ఇది క్రమంగా అలవడుతుంది.
సంఖ్య-- కొన్ని శుభం కలిగించే అంకెలు ఉంటాయి. వాటిలో మన సమయం, శక్తి కొద్ది చేయవచ్చు. 108 మంచి సంఖ్య. పెద్ద మంత్రాలు లేదా స్తోత్రాలైతే 3, 5, 9, 11, 21 51 సంఖ్యలలో చేయవచ్చు. [సమ (సరి) అంకెలు కాక విషమ (బేసి) అంకెలు తీసుకోవాలి అంటారు. 108కి అది వర్తించదు.]
మాధ్యమం-- జూమ్ యాప్ వేసుకోవాలి. ముందే ఏర్పాటు చేసుకుని సిద్ధంగా ఉంచుకోవాలి. ఎవరు జపం చేస్తున్నారో వారి పేరే కనపడాలి.
ఏం కావాలన్నా ప్రారంభానికి ముందో, అంతా అయ్యాకో వైయక్తికంగా సందేశం మంచిది.
----------------------------
రంగమధ్యంలో (జూమ్ సమావేశంలో)-
ధ్వనిపరికరం (మైక్)--
ధ్వనిపరికరం కూడా ఆపి ఉంటుంది. ఎక్కడా పొరపాటున కూడా పలికే వీలు కాదు. జపంలో విఘాతం కాకుండా ఆ విధంగా ఏర్పాటు చేసి ఉంటుంది. లిఖితసంభాషణం (చాట్)లో వ్రాయటం లేదా ప్రతిస్పందనలు (రియాక్షన్ లు) చేయరాదు.
దృశ్యపరికరం (కెమేరా)--
మనం కెమేరాలో కనిపించే పని ఉండదు. అది ఆపి పెట్టాలి.
నిశ్శబ్దం--
ప్రవేశించిన దగ్గరినుండి చివరి వరకు జపం మీదే దృష్టి ఉండాలి. వేరే ఏ రకమైన సంభాషణలకూ తావు ఉండదు. మొదలే ఇంట్లోవారికి పలకరించవద్దని చెప్పి విధిగా కూర్చోవాలి.
ఏకాగ్రత కోసం--
మీ చలవాణులు ఇతర పరికరాలను దూరం పెట్టండి. ధ్యాస ఏ విధంగానూ మళ్ళకుండా ఏర్పాటు చేసుకోండి.
సమయనియమం--
జూమ్ సమావేశంలో వేళకు ఐదునిముషాల ముందు చేరాలి. ప్రారంభం నుంచి చివరి వరకు ఉంటేనే మంచిది. ఫలితం పూర్తిగా దక్కుతుంది.
సంసిద్ధత--
పూర్వమే ఆసనంపై చక్కగా స్థిరంగా కూర్చుని అప్పుడు సమావేశంలోకి ప్రవేశించాలి. తరువాత ఎవరితోనూ ఏ రకమైన సంభాషణా సలుపవద్దు. ఇతర ధ్యాసలు పెట్టుకోవద్దు.
శ్లోకమంత్రం లిపి--
ఆనాటికి చదవాల్సిన శ్లోకమంత్రం స్క్రీన్ పై కనిపిస్తుంది (మూడు లిపులలో). చూసి చదవవచ్చు. లేదా వాట్సాప్ వర్గంలో పూర్వమే స్వరంతో పాటు వచ్చినప్పుడు అభ్యాసం చేసుకోవచ్చు.
ఆలస్యం--
అనివార్య కారణాల చేత ఆలస్యంగా వచ్చేవారు పద్ధతిని పాటించాలి. అంటే ప్రారంభంలో చెప్పే సూచనలు పాటించినాకే జపం మొదలు పెట్టాలి. సంఖ్య తగ్గినా ఫరవాలేదు. పద్ధతి పోకూడదు. అట్లాగే మధ్యలో వెళిపోయేవారైనా ముగింపులో చేయవలసినవి పాటించి వెళ్ళాలి.
శిక్షణం--
శ్లోకమంత్రం చదవటం బృందానికి అందరికి సామాన్యంగా నేర్పినప్పుడు శబ్దరహితంగానే ఉండి పలికి నేర్వాలి. శ్లోకమంత్రోచ్చారణం వీలైనంత స్పష్టంగా పైకే చదవాలి.
----------------------------
బృందజపం లో విభాగాలు--
జపం కంటే ముందు ప్రారంభంలో కొన్ని సూచనలు ఉంటాయి. అవి విని, చెప్పిన విధంగా చేయాలి. తరువాత 108 (ఒక మాల) జపం ముఖ్యం భాగం. జపం పూర్తి అయిన తరువాత మళ్ళీ కొన్ని సూచనలు ఉంటాయి. అవి చెప్పినవి విని, అట్లాగే చేసిన తరువాత, అప్పుడు అంతా ముగించుకుని సూచన తరువాతే కన్నులు తెరవాలి.
1. ప్రార్థన 2. నాటి శ్లోకమంత్రం శిక్షణం 3. ప్రారంభ సూచనలు 4. జపం 5. ముగింపు సూచనలు 6. స్వస్తివచనం
1. ప్రార్థన
ఓం శ్రీగురుభ్యో నమః
ఓం శ్రీగణేశాయ నమః
ఓం శ్రీసరస్వత్యై నమః
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః ।
గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః ॥
వక్రతుండ మహాకాయ సూర్యకోటిసమప్రభ ।
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి ।
విద్యారమ్భం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ॥
-----------
2. నాటి శ్లోకమంత్రం శిక్షణం
శిక్షకులు పలికితే ఒకరు ధ్వనిసహితంగా (అన్ మ్యూట్ లో) బిగ్గరగా పైకి చదువుతారు. మిగిలినవారంతా ధ్వనిరహితంగా (మ్యూట్ లో) బిగ్గరగా పలుకుతారు.
శిక్షకులు ఒకసారి పలికితే అనువాదకులు రెండు మార్లు చదువుతారు. దానినే ఇతరులంతా కలిసి పలుకుతారు.
చిన్న చిన్న భాగాలుగా శ్లోకం నేర్పబడుతుంది. రెండుసార్లు శిక్షణ ఉంటుంది. ఈలోపు పలకటం సరిగ్గా రాకపోయినా దిగులు లేదు. ఇతరులు చదువగా వింటూ తాము చదువగా వచ్చేస్తుంది.
-----------
3. ప్రారంభ సూచనలు
"నిటారుగా కూర్చోండి. ఐదు సార్లు ప్రాణాయామం చేయండి. నెమ్మదిగా శ్వాస తీసుకుని వదలండి. దేవతా భావన చేయండి. దేవతకు మనసులో చిత్రాన్ని ఊహించుకుని నమస్కరించండి. మీ కోరిక చెప్పుకోండి."
తరువాత వర్గసంకల్పం చెప్తారు. వినాలి- మనసులో అది జరగాలని మనసులో కోరుకోవాలి.
ఐదుసార్లు లోతుగా శ్వాస తీసుకుని వదలాలి. లేదా తెలిస్తే అనులోమవిలోమ ప్రాణాయామం చేయాలి. కన్నులు మూసుకుని ప్రాణాయామం చేయాలి.
సంకల్పం చేసుకునే వేళ మీ మనసులో మీ కోరికను మౌనంగా చెప్పుకోవచ్చు.
ఒకసారి జపానికి ఒక సంకల్పం ఉంటే మంచిది. లోకక్షేమం సామాన్యంగా కోరుకుంటాం.
దేవతకు నమస్కారం చెప్పించే వేళ ఆ దేవతను భావించుకోవాలి. దేవతాచిత్రం పటలంపై కనిపిస్తుంది. హృదయపూర్వకంగా నమస్కరించుకోవాలి.
-----------
4. జపం
108 సార్లు శ్లోకోచ్చారణం. సమావేశంలో ఒకరు పైకి చదువుతుంటారు. దానిప్రకారమే మిగితా వారు శబ్దరహితంగా చదువుతుంటారు. లయ తప్పకుండా ఒకేసారి చదవటం ముఖ్యం.
కావాలంటే 108 లేక్కకోసం కరమాల అరచేతివేళ్ళతో లెక్కించటం చేయవచ్చు. లేదా మీరు వాడే ఏదైనా జపమాల వాడవచ్చు. అయితే లెక్క బాధ్యత సదస్యులకు ఉండదు.
సమావేశంలో అంతా శబ్దరహితంగా మ్యూట్ ఉండి జపం చేయాలి. మీరు ఉన్న చోట బిగ్గరగా అనవచ్చు.
చివరలో మూడుసార్లు అదనంగా నెమ్మదిగా చెప్తారు. అది జపం పూర్తి అయిందని సూచన.
జపం పూర్తైన వెంటనే కన్నులు తెరవరాదు.
-----------
5. ముగింపు సూచనలు
"మంత్రధ్వనిని చెవులలో రింగుమననివ్వండి. కాసేపు అదే ధ్వనిని వింటూ ఉండండి. శ్వాస లోతుగా తీసుకుంటూ ఉండండి."
"ఓ దేవత, నీకు అనేక ధన్యవాదాలు. నీ అనుగ్రహం మాపై సదా ఉండుగాక. నీవు ఎల్లప్పుడూ మమ్మల్ని దయతో చూడాలిగాక. ఈ జప ఫలితాన్ని మేము అందరం పొందాలిగాక. మాకు సకల శుభాలను కలిగంచు."
"నెమ్మదిగా అరచేతులు రెండూ ఒకటికొకటి రాచుకుని కన్నులకు అద్దుకుని నెమ్మదిగా కళ్ళు తెరవండి."
-----------
6. స్వస్తివచనం
స్వస్తి ప్రజాభ్యః పరిపాలయన్తాం, న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః ।
గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవన్తు ॥
తరువాత అందరూ జూమ్ సమావేశాన్ని విడిచి వెళిపోవచ్చు. ఏదైనా చెప్పాలనిపిస్తే వ్యక్తిగతంగా లేదా వాట్సాప్ వర్గంలో సందేశం పంపవచ్చు.
----------------------------
Friday, 24 July 2026
బృందజపం- అర్థం, నియమాలు, విధి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment